గురించి





దేవుని ప్రేమలేఖలు వాస్తవంగా బైబిల్ లవ్ నోట్స్ అనే ఇంగ్లీష్ దానినుండి అనువదింపబడుతున్న పరిచర్య. ఈ సేవను తెలుగు భాషలో నేను చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దేవుని నడిపింపు మరియు గైల్ బర్టన్ పురత్ (ఫ్లోరిడా, కొలొరాడో నుండి) అనే బైబిల్ లవ్ నోట్స్ రచయిత్రి యొక్క అద్భుతమైన సహాయం, ప్రోత్సాహాలవల్ల ఈ వాక్యధ్యానాలను నేనే అనువదించి, బ్లాగ్ ను నిర్వహిస్తున్నాను. నా పేరు శ్రీలేఖ (నా మాతృ భాష తెలుగు), నేను ఇండియాకు చెందిన వ్యక్తిని అయినా దేవుని ప్రణాళిక బట్టి యూకే లో స్థిరపడ్డాను.

దేవుని మహా కృప నన్ను అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపి నేను పొందవలసిన శాశ్వత మరణం నుండి నిత్య జీవం లోనికి నడిపించింది. దీని వల్ల యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నిజమైన ఒకేఒక్క దేవుడని నేను తెలుసుకోని ఆయనను నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. అప్పటినుండి నా జీవితం పూర్తిగా మారిపోయింది. దేవుని యొక్క ఎడబాయని స్నేహం, నిత్యము నిలిచే శాశ్వతమైన తన ప్రేమవల్ల ఆయనలో ఉండే సమృద్ధి జీవాన్ని నేను అనుభవిస్తున్నాను అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేవునితో సంబంధం నాకు దేవుడు ఎరుగని ఆత్మలపట్ల తీవ్రమైన భారాన్ని ఇచ్చింది. అయన నన్ను రక్షించినట్టే అందరికి ఆ ఉచితమైన రక్షణను ఇవ్వడానికి ఆతృత కలిగిన దేవుడు ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవడం ఆయన చిత్తం కాదు..


నేను బైబిల్ లవ్ నోట్స్ లను చదివినప్పుడు, నాకు ఉన్న అదే భారాన్ని అవి వ్రాసే రచయిత్రి గైల్ వ్రాతల్లో నేను చూసాను. ఈ మారుతున్న రోజుల్లో, రకరకాల సంస్కృతిలు మధ్య ముఖ్యంగా దేవుని వాక్యాన్ని మార్చేసి వక్రీకరించే చెడు బోధలు ఎక్కువ అయిపోతున్నప్పుడు, ఆమె అందించే ప్రతీ ఒక్క దైవ వాక్య ధ్యానం లో దేవుని యొక్క స్థిరమైన సత్యాలు ఉండటం నిజంగా అవి చదివే మన అందరి ఆత్మలకు ఎంతో ఆశీర్వాదకరం.

ఈ బైబిల్ లవ్ నోట్స్ దైవ వాక్య ధ్యానాలు మారని స్వచ్ఛమైన దేవుని వాక్యంను అందిస్తూ, వాటిని చదివే వారు ఆ సత్య వాక్యంలో స్థిరపడి, బలమైన పునాదిని కలిగి దేవుని దృష్టికి యదార్ధంగా జీవించడానికి ఎంతో సహాయపడుతుంది. దేవుని యొక్క ప్రేమ నన్ను బలవంతం చేసి, వీటిని తెలుగు లో అనువదించాలని ప్రేరేపించడం వల్ల నేను దీనిని చేస్తున్నాను. నాలాగ తెలుగు మాట్లాడేవారు తప్పకుండ తెలుగులో వీటిని చదివి నాలాగే ఆత్మీయ మేలులు పొందాలని నా కోరిక.

ప్రతీ రోజు మనలో ప్రతీ ఒక్కరం మన పరలోకపు తండ్రికి ఎక్కువగా విధేయత చూపుతూ, ఆయన అద్భుతమైన కృపను బట్టి మన గురి అయిన యేసుకు దగ్గరగా చేరుతూ, మనమందరం కలిసి ఆ నిత్యమహిమలో మన దేవాదిదేవునికి తనివి తీరా ఎప్పటికి స్తుతులు అర్పిస్తూనే ఉండాలని నా ప్రార్ధన. యుగయుగములకు మన గొప్ప దేవుడు మహిమ పొందునుగాక. ఆమెన్ !!

1 comment:

  1. Appreciate your valuable initiative to provide these devotions to our Telugu people. God bless you and grant you wisdom and strength Amen

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.