నిత్యజీవము


పరలోకానికి చాలా మార్గాలు ఉన్నాయా?

నేను మొట్ట మొదటిసారి, రక్షించబడటానికి ఒకే మార్గం ఉంది --- పరలోకానికి ఒకే మార్గం ఉంది అని ఒక వ్యక్తి చెప్పగా వినడం నాకు బాగా గుర్తుంది.

ఖచ్చితంగా వారు చెప్పేది తప్పే అని నేను అనుకున్నాను. దేవుడిని బౌద్ధ మతస్థులు ఒక పేరుతో పిలుస్తారు, ముస్లింలు ఇంకో పేరుతో అలానే క్రైస్తవులు ఇంకోటి అని అనుకునేదాన్ని. ఇతర విశ్వాసాలకంటే మా దగ్గరే నిజమైన జవాబులు ఉన్నాయి అని క్రైస్తవులు అనుకోవడం సరైనది కాదు అనే ఆలోచనలో ఉండేదాన్ని.

అందరు చాలా భిన్నమైన దేవుళ్ళు

అప్పుడు ఇతర మతాలకు సంబంధించిన అన్ని గ్రంధాలను అలానే బైబిల్ ను కూడా చదివి క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు కొలిచే దేవుళ్ళు అంతా భిన్నమైన వ్యక్తిత్వాలు మరియు లక్ష్యాలు కలిగిన వారు అని నేను తెలుసుకున్నాను. మనమంతా ఆరాధిస్తుంది ఒకే దేవుణ్ణి కాదు.

అప్పుడు బైబిల్ లో ఈ క్రింది వాక్యాలను కూడా చదివాను :
దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. 1యోహాను 5:11,12

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16

యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. యోహాను 14:6

బైబిల్ మరియు యేసు స్వయంగా తాను మాత్రమే రక్షణకు మార్గం అని చెప్తున్నారు. అది ఏ ఒక్కరూ తమ స్వంతగా సంపాదించేది కాదు.

మరెన్నో ప్రశ్నలు

అయినా కూడా నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఇంకా జవాబులు కోసం వెతుకుతూనే ఉన్నాను.

నేను చదివింది అంతా నాకు అర్ధంకాకపోవడం నన్ను చాలా ఇబ్బందికి గురిచేసింది. తండ్రి సర్వమానవాళిని రక్షించడానికి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఎందుకు పంపించారు అదికూడా మన వంటి పాపాత్ముల కొరకు అనేది అర్ధం చేసుకోవడం నాకు అతికష్టమైన విషయంగా ఉండేది.

మిగతా విషయాలు అర్ధం చేసుకోవడం కొంచెం సులభం :

యేసు ప్రభువు అనే దేవుడు మాత్రమే రక్షణ అనేది విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది అని తెలియజేసారు.

వేరే మతాలైతే రక్షణ అనేది మంచి క్రియలపై, మతపరమైన ఆచారాలపై లేక అర్హతలపై ఆధారపడి ఉంటుంది.

మానవుల పాపసంబంధమైన సమస్యలకు కేవలం బైబిల్లో మాత్రమే మనకు జవాబులు దొరుకుతాయి.

సిలువలో యేసు చెల్లించిన వెల మాత్రమే మనిషికి ఉన్న ఏకైక నిరీక్షణ.

యేసుప్రభువుకు మన అవసరం లేకపోయినా మనల్ని తన పిల్లలుగా ఉండటానికి అయన ఆహ్వానిస్తున్నారు.

రక్షణ అనేది ఎవరైతే యేసు ప్రభువును నమ్మి వెంబడిస్తారో వారికి ఉచితంగా ఇవ్వబడే బహుమానం.

కాని యేసు ప్రభువు మనం కేవలం రక్షించబడే విశ్వసం మాత్రమే కాక మన జీవితాన్ని మార్చుకునే విశ్వాసం కూడా మన నుంచి ఆశిస్తారు.

ఒకసారి మనం క్రైస్తవులం అయ్యాక, మనలను మనం ఉపేక్షించుకొని క్రీస్తును వెంబడించాలి (లూకా 14:26-33). మంచి క్రియలు వలన మనం రక్షించబడలేదుగాని, మంచి క్రియలు చేయడానికి కూడా మనం రక్షించబడ్డాం (ఎఫెస్సీయులకు 2:10, యాకోబు 2:14-26)

దేవుని గురించిన సత్యాలు వెతకడం అనేది ప్రతి ఒక్కరికి ఉన్న అవకాశం. మనం ఆయన్ని వెతికితే తప్పక ఆయన్ని కనుగొంటాం అని ఆ దేవుడే మనకు వాగ్దానం చేసారు (యిర్మీయా 29:13; మత్తయి 7:7-11).

తెలియకపోయినా  లోబడటం :

నాకు అర్ధమైన వాటిని బట్టి యేసు ప్రభువుకు నా జీవితాన్ని అంకితం చేసాను. నాకు అర్థంకాని ఒక విషయం ఆయన యొక్క ఆశ్చర్యకరమైన రక్షించే ప్రేమ.

క్రీస్తును తెలుసుకునేకొద్దీ, బైబిల్ని అర్ధం చేసుకునేకొద్దీ, నాకు దేవుని గురించి అర్ధం కాని విషయాలలో కూడా నేను గొప్ప ఆదరణను నెమ్మదిని పొందుకున్నాను. దేవుడు నా ఊహకు మించి ఎంతో గొప్పవాడు జ్ఞానసంపూర్ణుడు అని దీని ద్వారా నాకు నిరూపణ అయింది.

నీవు గనుక ఇంకా ఆ యేసు ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించకపోతే, బైబిల్ని చదివి ఆ దేవుణ్ణి వెతకాలి అని నా మనవి. నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెతికితే, తప్పకుండ ఆయనను నీవు కనుగొంటావు (మత్తయి 7:7-11).

నీవు యేసు క్రీస్తును అంగీకరించాలని ఇష్టపడుతున్నావా?

నీవు రక్షణ పొందాలంటే, ఈ క్రింది సత్యాలు నీవు అర్థంచేసుకోవాలి :

1. పరలోకానికి వెళ్ళడానికి ఏ ఒక్కరు అర్హులు కారు.
 ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. రోమీయులకు 3:23

2. మరణం పొందడానికి మనం అందరం అర్హులం.
ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము. రోమీయులకు 6:23

3. అయినప్పటికీ దేవాదిదేవుడు మనలను ప్రేమించి యేసుప్రభువును మన పాపముల కొరకు సిలువలో వెల చెల్లించడానికి పంపించారు
అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. రోమీయులకు 5:8

4. ఈ గొప్ప రక్షణ అనే దేవుని బహుమానాన్ని కపటం లేకుండా పూర్ణహృదయముతో విశ్వాసపూర్వకంగా నోటితో ఒప్పుకోవడం ద్వారా మాత్రమే పొందుకోగలం.
అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమీయులకు 10:9,10

ఈ విషయాలు నువ్వు నమ్మినప్పుడు, యేసు "వెల చెల్లించేందుకు కూడా సిద్ధపడాలి" అనే ముఖ్య విషయాన్ని ఇక్కడ మనకు గుర్తుచేస్తున్నారు.

సత్క్రియలు వలన మనం రక్షణను సంపాదించలేము. కేవలం దేవుని యొక్క అపారమైన కృప వల్లే రక్షణ సాధ్యం. ఒకసారి రక్షణ పొందాక, మన మనస్సు మారి రూపాంతరం పొందటానికి దైవవాక్యానికి మనం అంటుకట్టబడి ఉండాలి, పాపాలను విడిచిపెట్టాలి, మనల్ని మనం తృణీకరించుకొని క్రీస్తును వెంబడించాలి. ఇదంతా హృదయపూర్వక సమర్పనైవుండాలి.

ఈ విషయాలు అన్నీ నీకు పూర్తిగా అర్థమై, క్రీస్తును వెంబడించాలి అని ఆశపడితే, ముందుగా నీవు చేయవలసింది నీ పాపాల కొరకు పశ్చాత్తాపపడి, క్రీస్తును నీ ప్రభువుగా రక్షకునిగా ఉండమని అడుగు. దేవుడు నిన్ను దీవించునుగాక !

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.